'చంటి'(1992)తో తెలుగునాట ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్.. విక్టరీ వెంకటేశ్, స్టార్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టిది. ఆ చిత్రం తరువాత ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమా 'కొండపల్లి రాజా'(1993). 'చంటి' ఎలాగైతే రీమేక్ మూవీనో.. 'కొండపల్లి రాజా' సైతం రీమేక్ చిత్రం కావడం విశేషం. తమిళ సినిమా 'చిన్న తంబి' (1991) ఆధారంగా 'చంటి' తెరకెక్కితే.. 'కొండపల్లి రాజా' కూడా 'అణ్ణామలై' (1992) అనే తమిళ చిత్రం ఆధారంగా రూపొందింది. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'అణ్ణామలై' కూడా రీమేక్ నే. 1987లో విడుదలైన హిందీ చిత్రం 'ఖుద్ గర్జ్' ఆధారంగా 'అణ్ణామలై' తయారైంది. అయితే, 'అణ్ణామలై' కంటే ముందు 'ఖుద్ గర్జ్'కి రీమేక్ గా తెలుగునాట 'ప్రాణ స్నేహితులు' (1988) (కృష్ణంరాజు, శరత్ బాబు, రాధ) రూపొందడం విశేషం. అంటే.. 5 ఏళ్ళ వ్యవధిలో ఒకే కథతో ప్రాణ స్నేహితులు, కొండపల్లి రాజా తెరకెక్కాయన్నమాట. మరో విషయమేమిటంటే.. ఇటు 'ప్రాణ స్నేహితులు'లోనూ, అటు 'అణ్ణామలై'లోనూ హీరోకి ఫ్రెండ్ గా శరత్ బాబు నటించారు.
ఇక 'కొండపల్లి రాజా' కథ విషయానికి వస్తే.. రాజా (వెంకటేశ్), అశోక్ (సుమన్) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. వారి స్నేహం గిట్టని అశోక్ తండ్రి గంగాధరం (కోట శ్రీనివాసరావు) కారణంగా విడిపోతారు. తిరిగి ఈ మిత్రులు ఎలా దగ్గరయ్యారు? అనేదే మిగిలిన కథ. ఆసక్తికరమైన కథనంతో తెరకెక్కిన ఈ రీమేక్.. అప్పట్లో ప్రజాదరణ పొందింది. ఇందులో వెంకీకి జంటగా నగ్మా కనిపించగా.. సుమన్ కి జోడీగా రేఖ దర్శనమిచ్చింది. 'చంటి'లో వెంకీకి అమ్మగా నటించిన సుజాత.. ఇందులోనూ అదే పాత్రలో ఆకట్టుకున్నారు. అదే విధంగా 'చంటి'లో చిన్ననాటి వెంకటేశ్ గా అలరించిన మాస్టర్ రాఘవేంద్ర.. 'కొండపల్లి రాజా'లోనూ వెంకటేశ్ చిన్నప్పటి పాత్రను పోషించడం విశేషం. శ్రీకాంత్, అలీ, యువరాణి, సుధాకర్, అర్చనా పూరన్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఎంటర్టైన్ చేశారు.
ఇక పాటల విషయానికి వస్తే.. స్వరవాణి కీరవాణి బాణీలన్నీ చార్ట్ బస్టర్సే. టైటిల్ సాంగ్ తో పాటు ''దానిమ్మ తోటలోకి'', ''గువ్వమ్ గుడుగుడు'', ''అమ్మమ్మమ్మమ్మో'', ''ఏ కాశీలో సిగ్గు'', ''సింగరాయకొండ''.. ఇలా ఇందులోని గీతాలన్నీ జనరంజకమే. సౌదామిని క్రియేషన్స్ పతాకంపై కేవీవీ సత్యనారాయణ నిర్మించిన 'కొండపల్లి రాజా'.. 1993 జూలై 9న విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. ఆదివారంతో ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.